౩
౧ తిరుగుబాటు పట్టణానికి బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.
౨ అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు.
యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు.
౩ దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహాలు.
దాని న్యాయాధిపతులు రాత్రివేళ తిరుగులాడుతూ తెల్లవారేదాకా ఎరలో ఏమీ మిగలకుండా పీక్కు తినే తోడేళ్లు.
౪ దాని ప్రవక్తలు పెంకెతనం గలవారు, విశ్వాసఘాతకులు.
దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు.
౫ అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు.
ఆయన అక్రమం చేసేవాడు కాడు.
అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు.
ఆయనకు రహస్యమైనదేమీ లేదు.
అయినా నీతిహీనులకు సిగ్గులేదు.
౬ నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి.
ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి.
జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే.
౭ దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా,
నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని,
వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు.
౮ కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే,
“నా కోసం ఎదురు చూడండి.
నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి.
నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి,
అన్యజనులను పోగు చేయడానికి,
గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి,
నేను నిశ్చయించుకున్నాను.
నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది.
౯ అప్పుడు మనుషులంతా యెహోవా నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించేలా నేను వారికి పవిత్రమైన పెదవులనిస్తాను.
౧౦ చెదరి పోయి నాకు ప్రార్థన చేసే నా ప్రజలను కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకు వస్తారు.
౧౧ ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను.
కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు.
నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు.
౧౨ దుఃఖితులైన దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించే జనశేషంగా నీమధ్య ఉండనిస్తాను.
౧౩ ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు.
అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు.
వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.”
౧౪ సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి.
ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి.
యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి.
౧౫ మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు.
మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు.
ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు.
ఇక మీదట మీకు అపాయం సంభవించదు.
౧౬ ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు.
యెరూషలేమూ, భయపడకు.
సీయోనూ, ధైర్యం తెచ్చుకో.
౧౭ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.
ఆయన శక్తిశాలి.
ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.
నీపట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.
౧౮ నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడే నీ బంధువులను నేను సమకూరుస్తాను.
వారు గొప్ప అవమానం పొందిన వారు.
౧౯ ఆ కాలమున నిన్ను హింస పెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను.
కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను.
చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను.
ఏ యే దేశాల్లో వారు అవమానం పాలయ్యారో అలాటి ప్రతి చోటా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను.
౨౦ ఆ కాలంలో మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోనుండి రప్పించి,
మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను.
నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కట్టబెడతాను.
ఇదే యెహోవా వాక్కు.