౪
౧ బోయజు పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు. ౨ బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.
౩ తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను. ౪ ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.
౫ అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు. ౬ దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.
౭ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు. ౮ ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.
౯ అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం- కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు. ౧౦ అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు” అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.
౧౧ అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక! ౧౨ ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబంలా ఉండుగాక!” అన్నారు.
౧౩ బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. ౧౪ అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక. ౧౫ నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు.
౧౬ అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది. ౧౭ ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.
౧౮ పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను. ౧౯ హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు. ౨౦ అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. ౨౧ శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. ౨౨ ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.