౧౪౭
౧ యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది.
౨ యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే.
౩ గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
౪ ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
౫ మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.
౬ యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.
౭ కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.
౮ ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
౯ పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
౧౦ గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు.
౧౧ తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.
౧౨ యెరూషలేమా, యెహోవాను ఘనపరచు. సీయోనూ, నీ దేవుణ్ణి కీర్తించు.
౧౩ ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు.
౧౪ నీ పొలిమేరల్లో శాంతి సమాధానాలు నిలిచి ఉండేలా చేసేది ఆయనే. నీకు ఆహారంగా మంచి గోదుమ పంటను ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే.
౧౫ భూమికి ఆజ్ఞ జారీ చేసేవాడు ఆయనే. ఆయన వాక్కు భూమిపై చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
౧౬ గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.
౧౭ వడగళ్ళు ముక్కలు ముక్కలుగా నేలపై విసిరేది ఆయనే. ఆయన చలి పుట్టించినప్పుడు ఎవరు తట్టుకోగలరు?
౧౮ ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి వీచేలా చేస్తే నీళ్లు ప్రవహిస్తాయి.
౧౯ తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు.
౨౦ మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.