౧౪౩
దావీదు కీర్తన
౧ యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
౨ నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు.
౩ నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు.నన్ను నేలకేసి తొక్కిపెట్టాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళతోబాటు నన్ను కూడా పాతాళంలో ఉండిపోయేలా చేయాలని చూస్తున్నాడు.
౪ నా హృదయం నాలో నిరాశకు లోనైంది. నా ఆత్మ నాలో క్షీణించిపోయింది.
౫ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
౬ నీ వైపు నా చేతులు ఆశగా చాపుతున్నాను. ఎండి నెర్రెలు విచ్చిన నేలలాగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతూ ఉంది.
సెలా.
౭ యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
౮ నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
౯ యెహోవా, నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించు. నీ అండనే కోరుతున్నాను.
౧౦ నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
౧౧ యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.
౧౨ నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి.