౧౪౧
దావీదు కీర్తన
౧ యెహోవా, నేను నీ కోసం ఆక్రోశిస్తున్నాను. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకో. నేను మొరపెడుతున్నాను, నేను చెప్పేది ఆలకించు.
౨ నా ప్రార్థన నీకు ధూపం లాగా నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం లాగా ఉండు గాక.
౩ యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.
౪ నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.
౫ నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి.
౬ దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు.
౭ వారు అంటారు, ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
౮ యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు.
౯ నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.
౧౦ నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.