౭౫
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట.
౧ దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు.
౨ నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను.
౩ భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను.
సెలా.
౪ అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.
౫ విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను.
౬ తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.
౭ దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు.
౮ యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు.
భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి.
౯ నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను.
౧౦ నేను భక్తిహీనుల కొమ్ములను విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు.