౬౧
ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన
౧ దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.
౨ నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండపైకి నన్ను ఎక్కించు.
౩ నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
౪ యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను.
సెలా.
౫ దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.
౬ రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.
౭ అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.
౮ ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.