౫
గదరా ప్రదేశంలో ఉన్మాది (మత్తయి 8:28-34. లూకా 8:26-37)
౧ వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. ౨ యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. ౩ వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. ౪ వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. ౫ వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.
౬ వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. ౭ “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. ౮ ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు.
౯ ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. ౧౦ అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. ౧౧ ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
౧౨ ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. ౧౩ యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
౧౪ ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. ౧౫ వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకొని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. ౧౬ అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. ౧౭ వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
౧౮ యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. ౧౯ కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. ౨౦ అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
రక్త స్రావం గల స్త్రీకి స్వస్థత, యాయీరు కుమార్తెకు ప్రాణ దానం (మత్తయి 9:18-26. లూకా 8:41-56)
౨౧ యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకొన్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది. ౨౨ అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి ౨౩ “నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు. ౨౪ యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
౨౫ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ౨౬ ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. ౨౭ యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. ౨౮ తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకొని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. ౨౯ వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
౩౦ వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు. ౩౧ ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు. ౩౨ కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు. ౩౩ ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది. ౩౪ ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు.
౩౫ యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు. ౩౬ యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్ర౦ ఉంచు” అన్నాడు. ౩౭ అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు.
౩౮ ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు. ౩౯ ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు. ౪౦ కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు.
౪౧ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం. ౪౨ వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ౪౩ ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.