౪
౧ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు. ౨ అయితే నా పట్ల భయభక్తులు ఉన్న మీ కోసం నీతిసూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు బయటికి వెళ్లి కొవ్విన దూడల్లాగా గంతులు వేస్తారు. ౩ నేను నియమించే ఆ రోజు దుర్మార్గులు మీ కాళ్ళ కింద బూడిదలాగా ఉంటారు. మీరు వాళ్ళను అణగదొక్కుతారు.
౪ హోరేబు కొండ మీద ఇశ్రాయేలు ప్రజల కోసం నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి. ౫ యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను. ౬ నేను వచ్చి దేశాన్ని శపించకుండా ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు, పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు తిప్పుతాడు.”