౧౬
౧ అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు,
౨ ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు.
౩ నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది?
౪ నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి.
౫ అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి.
౬ ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు, అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు.
౭ దేవుడు నాకు ఆయాసం కలగజేశాడు. దేవా, నా బంధువర్గమంతటినీ నువ్వు నాశనం చేశావు.
౮ నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి, మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది.
౯ ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు.
౧౦ మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు.
౧౧ దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు.
౧౨ నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు.
౧౩ ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి, దయ లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు.
౧౪ దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగగొడుతున్నాడు. యుద్ధ వీరుని వలే పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు.
౧౫ నా చర్మానికి గోనెపట్ట కప్పుకుని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పోసుకుని మురికి చేసుకున్నాను.
౧౬ నేను ఎవ్వరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధం.
౧౭ ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది.
౧౮ భూమీ, ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనియ్యి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి.
౧౯ ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు.
౨౦ నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
౨౧ ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి.
౨౨ ఇంకా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత నేను తిరిగిరాని దారిలో వెళ్ళిపోతాను.