౪౪
౧ ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది. ౨ “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. నేను యెరూషలేము పైకీ మిగిలిన యూదా దేశపు పట్టణాల పైకీ పంపిన విపత్తులన్నిటినీ మీరు చూశారు. చూడండి, అవి శిథిలాలై పడి ఉన్నాయి. అక్కడ ఎవరూ నివసించడం లేదు. ౩ మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది.
౪ అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను. ౫ కానీ వాళ్ళు వినలేదు. ఇతర దేవుళ్ళకి ధూపం వేయడం గానీ, దుర్మార్గపు పనులను చేయడం గానీ మానుకోలేదు. నా మాటపై శ్రద్ధ పెట్టలేదు. ౬ కాబట్టి నా దగ్గర నుండి తీవ్రమైన కోపం, ఉగ్రత ప్రవహించింది. అది అగ్నిలా యూదా పట్టణాలనూ, యెరూషలేము రహదారులనూ తగులబెట్టింది. కాబట్టి అవి ఇప్పుడు చూస్తున్నట్టుగా నాశనమై శిథిలాలుగా పడి ఉన్నాయి.”
౭ కాబట్టి ఇప్పుడు సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీకు విరోధంగా మీరే ఎందుకిలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు? స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, పసికందులూ ఇలా ఎవరూ యూదా దేశంలో ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీరే ఎందుకు చేసుకుంటున్నారు? ౮ మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు. మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్తు దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు. మీరు నాశనం కావడానికీ భూమి పైన ఉన్న అన్ని దేశాల్లో మీరు నవ్వుల పాలు కావడానికీ, ఒక శాప వచనంగా ఉండటానికీ మీరు అక్కడికి వెళ్తున్నారు.
౯ మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా? ౧౦ ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”
౧౧ కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను. ౧౨ యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు.
౧౩ యెరూషలేములో నివసించే వాళ్ళని కత్తితో, కరువుతో, వ్యాధులతో నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తులో నివసించే వాళ్ళను కూడా శిక్షిస్తాను. ౧౪ ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.”
౧౫ అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు. ౧౬ వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం. ౧౭ మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
౧౮ మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.” ౧౯ అక్కడి స్త్రీలు “మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?” అన్నారు.
౨౦ అప్పుడు యిర్మీయా ఆ ప్రజలందరితో, ఆ స్త్రీ పురుషులందరితో, తనకు జవాబు చెప్పిన వాళ్ళందరితో ఇలా అన్నాడు. వాళ్ళకి ఇలా ప్రకటన చేశాడు. ౨౧ “మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.
౨౨ ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు. ౨౩ మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.”
౨౪ తర్వాత యిర్మీయా అక్కడి ప్రజలనందరికీ, స్త్రీలందరికీ ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. ౨౫ సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.’ అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి.
౨౬ అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు. ౨౭ నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు. ౨౮ కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
౨౯ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.’ ౩౦ యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రా ను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.”