౩౮
౧  “యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.”
౨ యెహోవా ఇలా అంటున్నాడు. “ఈ పట్టణం కచ్చితంగా బబులోను రాజు సైన్యం చేతికి అప్పగించడం జరుగుతుంది. అతడు దాన్ని చెరపట్టుకుంటాడు,” అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు, ౩ మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమ్యా కొడుకు యూకలు, మల్కీయా కొడుకు పషూరు విన్నారు గనుక ఆ నాయకులు రాజుతో “ఈ మనిషి ఈ ప్రజల నాశనం కోరేవాడేగాని, క్షేమం కోరేవాడు కాదు. ౪ ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు. ౫ అందుకు రాజైన సిద్కియా “అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,” అన్నాడు.
౬ వాళ్ళు యిర్మీయాను పట్టుకుని చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
౭ అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ౮ కాబట్టి ఎబెద్మెలెకు రాజ గృహంలోనుంచి వెళ్లి రాజుతో ఇలా అన్నాడు, ౯  “రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.”
౧౦ అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్మెలెకుకు ఆజ్ఞ ఇచ్చి “నువ్వు ఇక్కడనుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి, ప్రవక్త అయిన యిర్మీయా చావకముందు ఆ గోతిలోనుంచి అతన్ని తీయించు,” అన్నాడు. ౧౧ కాబట్టి ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజమందిరంలో ఖజానా కింద గదిలోకి వచ్చాడు.
౧౨ అక్కడ నుంచి పాతబడి చీకిపోయి, చినిగిపోయిన బట్టలు తీసుకువెళ్లి, ఆ గోతిలో ఉన్న యిర్మీయా పట్టుకునేలా తాళ్ళతో వాటిని దింపి “పాతవై చిరిగి చీకిపోయిన ఈ బట్టలతో పేనిన తాళ్ళను నీ చంకల కింద పెట్టుకో,” అని అతనితో చెప్పాడు. ౧౩ యిర్మీయా అలాగే చేశాడు. అప్పుడు వాళ్ళు యిర్మీయాను తాళ్ళతో లాగారు. ఈ విధంగా వాళ్ళు అతన్ని ఆ గోతిలోనుంచి పైకి లాగారు. ఆ తరువాత యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలో ఉంటూ ఉన్నాడు.
౧౪ తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో “నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,” అన్నాడు. ౧౫ యిర్మీయా సిద్కియాతో “నేను నీకు జవాబు చెప్తే, కచ్చితంగా నువ్వు నాకు మరణ శిక్ష వేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు నా మాట వినవు,” అన్నాడు. ౧౬ కాని రాజైన సిద్కియా ఏకాంతంగా యిర్మీయాతో ప్రమాణం చేసి “మనలను సృష్టించిన యెహోవా తోడు, నేను నిన్ను చంపను, నిన్ను చంపాలని చూసేవాళ్ల చేతికి నిన్ను అప్పగించను,” అన్నాడు.
౧౭ కాబట్టి యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు, యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల దగ్గరికి వెళ్తే బతుకుతావు. ఈ నగరాన్ని తగలబెట్టరు. నువ్వూ, నీ ఇంటి వాళ్ళు బతుకుతారు. ౧౮ కాని నువ్వు బబులోను అధిపతుల దగ్గరికి వెళ్లకపోతే, ఈ నగరాన్ని కల్దీయుల చేతికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు అగ్నితో దాన్ని కాల్చేస్తారు. నువ్వు వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు.”
౧౯ అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో “కల్దీయుల పక్షంగా ఉన్న యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే, వాళ్ళు నాపట్ల చెడ్డగా ప్రవర్తిస్తారు,” అన్నాడు.
౨౦ అందుకు యిర్మీయా “నిన్ను వాళ్ళ చేతికి అప్పగించరు. నీకు అన్నీ సవ్యంగా జరిగేలా, నువ్వు బతికేలా నేను నీతో చెప్పిన యెహోవా సందేశానికి లోబడు. ౨౧ కాని, నువ్వు ఒకవేళ బయలుదేరి వెళ్లకపోతే, యెహోవా నాకు చూపించిన సంగతి ఇదే.
౨౨ యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు,
‘నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు.
నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు. ౨౩ నీ భార్యలందరినీ, నీ పిల్లలనూ కల్దీయుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నువ్వు కూడా వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు. బబులోను రాజుకు దొరికిపోతావు గనుక ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చడానికి నువ్వే కారణం అవుతావు.’ ”
౨౪ అప్పుడు సిద్కియా యిర్మీయాతో “నువ్వు చావకుండా ఉండాలంటే ఈ సంగతులు ఎవరికీ చెప్పొద్దు. ౨౫ నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులకు తెలిస్తే, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి, ‘రాజుతో ఏం మాట్లాడావో చెప్పు. మానుంచి దాచకు, లేకపోతే చంపేస్తాం. ఇంకా, రాజు నీతో చెప్పిన సంగతులు మాకు చెప్పు,’ అంటారు. ౨౬ అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘యోనాతాను ఇంటికి మళ్ళీ నన్ను పంపొద్దని, పంపితే నేను అక్కడ చనిపోతానని రాజుతో విన్నవించుకున్నాను,’ అని చెప్పాలి,” అన్నాడు.
౨౭ అప్పుడు అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతడు రాజు చెప్పిన మాటల ప్రకారం వాళ్లకు జవాబిచ్చి ఆ విషయం వాళ్లకు తెలియజేయని కారణంగా వాళ్ళు అతనితో మాట్లాడడం ఆపారు. ఎందుకంటే యిర్మీయాతో రాజు చేసిన సంభాషణ వాళ్ళు వినలేదు. ౨౮ యెరూషలేము స్వాధీనం అయ్యే రోజు వరకూ యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలోనే ఉన్నాడు.