౯
౧ యెరుబ్బయలు కొడుకు అబీమెలెకు షెకెములో ఉన్న తన మేనమామల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో, తన తల్లి పూర్వీకుల కుటుంబాల వారితో, ౨ “మీరు దయచేసి షెకెము నాయకులందరూ వినేలా వాళ్ళతో మాట్లాడండి, మీకేది మంచిది? యెరుబ్బయలు కొడుకులు డెబ్భైమంది మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకం చేసుకోండి” అని అన్నాడు. ౩ అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినేలా ఆ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు “ఇతను మన సహోదరుడు” అనుకుని తమ హృదయం అబీమెలెకు వైపు తిప్పుకున్నారు.
౪ అప్పుడు వాళ్ళు బయల్బెరీతు గుడిలోనుంచి డెబ్భై తులాల వెండి తెచ్చి అతనికి ఇచ్చినప్పుడు వాటితో అబీమెలెకు అల్లరి మూకను కూలికి పెట్టుకున్నాడు. వాళ్ళు అతని వశంలో ఉన్నవాళ్ళు. ౫ తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యింటికి వెళ్లి యెరుబ్బయలు కొడుకులు, తన సహోదరులు అయిన ఆ డెబ్భై మందిని ఒక్క బండ మీద చంపాడు. యెరుబ్బయలు చిన్న కొడుకు యోతాము మాత్రమే దాక్కుని తప్పించుకున్నాడు.
౬ తరువాత షెకెము నాయకులందరూ, బెత్ మిల్లో ఇంటివారందరూ కలిసి వచ్చి షెకెములో ఉన్న మస్తకి చెట్టు కింద శిబిరం దగ్గర అబీమెలెకును రాజుగా నియమించారు. ౭ అది యోతాముకు తెలిసినప్పుడు అతడు వెళ్లి గెరిజీము కొండ అంచు మీద నిలబడి బిగ్గరగా పిలిచి, వాళ్ళతో ఇలా అన్నాడు,
“షెకెము పెద్దలారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. ౮ చెట్లు తమ మీద ఒక రాజును అభిషేకించుకోవాలనుకుని, బయలుదేరి ౯ మమ్మల్ని ఏలమని ఒలీవచెట్టుని అడిగాయి. ఒలీవచెట్టు ‘దేవుణ్ణీ మానవులనూ దేనివలన మనుషులు సన్మానిస్తారో అలాటి నా నూనె ఇవ్వకుండా చెట్లమీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా’ అని వాటితో అంది.
౧౦ అప్పుడు చెట్లు, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని అంజూరపు చెట్టును అడిగాయి. ౧౧ అంజూరపు చెట్టు, ‘చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానాలా?’ అని వాటితో అంది.
౧౨ ఆ తరువాత చెట్లు, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని ద్రాక్షావల్లిని అడిగినప్పుడు ద్రాక్షావల్లి, ౧౩ ‘దేవుణ్ణీ మానవులనూ సంతోషపెట్టే నా రసాన్ని ఇవ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా’ అని వాటితో అంది.
౧౪ అప్పుడు చెట్లన్నీ, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని ముళ్ళపొదతో మనవి చేసినప్పుడు ౧౫ ముండ్ల పొద ‘మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది’ అని చెట్లతో చెప్పింది.”
౧౬ “నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు. ౧౭ అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి, ఒకే బండ మీద అతనిడెబ్భై మంది కొడుకులను చంపిన, అతని దాసీ కొడుకు అబీమెలెకు మీ బంధువు కాబట్టి, షెకెమువాళ్ళ మీద అతన్ని రాజుగా నియమించారు. యెరుబ్బయలుకు, అతని ఇంటి వాళ్ళకు, మీరు ఉపకారం చెయ్యకుండా ౧౮ అబీమెలెకును రాజుగా నియమించుకొన్న విషయంలో మీరు యథార్ధంగా ప్రవర్తించి ఉంటే ౧౯ నేడు మీరు యెరుబ్బయలు పట్ల అతని యింటివాళ్ళ పట్ల సత్యంగా యథార్ధంగా ప్రవర్తించి ఉంటే, అబీమెలెకునుబట్టి సంతోషించండి. అతడు మిమ్మల్నిబట్టి సంతోషిస్తాడు గాక. ౨౦ అలా కాకపోతే అబీమెలెకు నుంచి అగ్ని బయలుదేరి షెకెము వాళ్ళనీ బెత్ మిల్లో యింటి వాళ్ళనీ కాల్చివేయు గాక. షెకెము వాళ్ళలో నుంచి, బెత్ మిల్లో యింటినుంచి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయు గాక” అని చెప్పాడు. ౨౧ అప్పుడు యోతాము తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేరుకు వెళ్లి అక్కడ నివసించాడు.
౨౨ అబీమెలెకు మూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేశాడు. ౨౩ దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదికి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమేలెకుతో తమకున్న ఇప్పండం విషయంలో ద్రోహం చేశారు.
౨౪ యెరుబ్బయలు డెబ్భైమంది కొడుకులకు అబీమెలెకు చేసిన ద్రోహం మూలంగా వాళ్ళను చంపిన వారి సోదరుడు అబీమెలెకు మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు ఈ విధంగా చేశాడు. అతడు తన సహోదరులను చంపేలా అతన్ని బలపరచిన షెకెము నాయకుల మీదికి కూడా ఆ నరహత్య ఫలం వచ్చేలా ఆయన చేశాడు. ౨౫ షెకెము యజమానులు కొండ శిఖరాలమీద అతని కోసం మాటు గాళ్ళను ఉంచి, ఆ దారిలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దోచుకున్నారు. అది అబీమెలెకుకు తెలిసింది.
౨౬ ఎబెదు కొడుకు గాలు, అతని బంధువులు, షెకెముకు చేరినప్పుడు షెకెము పెద్దలు అతన్ని ఆశ్రయించారు. ౨౭ వాళ్ళు పొలాల్లోకి వెళ్లి ద్రాక్ష పళ్ళు ఏరుకుని, వాటిని తొక్కి కృతజ్ఞతార్పణం చెల్లించి, తమ దేవుళ్ళ మందిరంలోకి వెళ్లి పండగ చేసుకున్నారు. వారు అన్నపానాలు పుచ్చుకొంటూ అబీమెలెకును దూషించినప్పుడు ౨౮ ఎబెదు కొడుకు గాలు ఇలా అన్నాడు “అబీమెలెకు ఎంతటివాడు? షెకెము ఎంతటివాడు? మనం అతనికెందుకు దాసులం కావాలి? అతడు యెరుబ్బయలు కొడుకు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి హమోరుకు చెందిన వాళ్ళను సేవిస్తాం గాని, మనం అబబీమెలెకుకు దాసులుగా ఎందుకుండాలి? ౨౯ ఈ ప్రజలు నా ఆధీనం ఉంటేనా! నేను అబీమెలెకును కూలదోసేవాణ్ణి గదా! అబీమెలెకుతో, ‘నీ సైన్యాన్ని బయలుదేరి రమ్మను’ అనేవాణ్ణి గదా!” అన్నాడు.
౩౦ ఎబెదు కొడుకైన గాలు మాటలు ఆ పట్టణ ప్రధాని జెబులు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ౩౧ అప్పుడతడు, అబీమెలెకు దగ్గరికి రహస్యంగా మనుషులను పంపి “ఎబెదు కొడుకు గాలు, అతని బంధువులు షెకెముకు వచ్చారు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఈ పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు ౩౨ కాబట్టి, ఈ రాత్రి నువ్వు, నీతో ఉన్న మనుషులు, లేచి పొలంలో మాటు వెయ్యండి. ౩౩ ప్రొద్దున సూర్యుడు ఉదయించగానే నువ్వు త్వరగా లేచి పట్టణం మీద దాడి చెయ్యాలి. అప్పుడు అతడు అతనితో ఉన్న మనుషులు నీ మీదికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు నువ్వు సమయం చూసి వాళ్ళకు చెయ్యవలసింది చెయ్యవచ్చు” అని కబురు పంపాడు.
౩౪ అబీమెలెకు అతనితో ఉన్న మనుషులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెము మీద దాడి చెయ్యడానికి పొంచి ఉన్నారు. ౩౫ ఎబెదు కొడుకు గాలు బయలుదేరి పట్టణం ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు అబీమెలెకు, అతనితో ఉన్న మనుషులు పొంచి ఉన్న చోటు నుండి లేచారు.
౩౬ గాలు ఆ మనుషులను చూసి, జెబులుతో “ఇదిగో మనుషులు కొండ శిఖరాల మీద నుంచి దిగివస్తున్నారు” అన్నప్పుడు జెబులు “కొండల నీడలు నీకు మనుషుల్లా కనిపిస్తున్నాయి” అన్నాడు. ౩౭ అప్పుడు గాలు “చూడు, ఆ ప్రాంతంలోని ఉన్నత స్థలం నుంచి మనుషులు దిగి వస్తున్నారు. ఒక గుంపు శకునగాళ్ళ మస్తకి వృక్షపు దారిలో వస్తూ ఉంది” అన్నాడు. ౩౮ జెబులు అతనితో “మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు, అని నువ్వు చెప్పిన గొప్పలు ఏమైనాయి? వీళ్ళు నువ్వు తృణీకరించిన మనుషులు కాదా? ఇప్పుడు వెళ్లి వాళ్ళతో యుద్ధం చెయ్యి” అన్నాడు.
౩౯ గాలు షెకెము నాయకులను ముందుకు నడిపిస్తూ బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. ౪౦ అబీమెలెకు అతన్ని తరమగా, అతడు అతని యెదుట నిలువలేక పారిపోయాడు. చాలామంది గాయపడి పట్టణం ద్వారం వరకూ కూలారు. ౪౧ అప్పుడు అబీమెలెకు అరూమాలో ఉన్నాడు. గాలును అతని బంధువులనూ షెకెములో నివాసం ఉండకుండాా జెబులు వాళ్ళని తోలి వేశాడు. ౪౨ తరువాతి రోజు ప్రజలు పొలాల్లోకి బయలుదేరి వెళ్ళారు. ౪౩ అది అబీమెలెకుకు తెలిసినప్పుడు అతడు తన మనుషులను మూడు గుంపులుగా చేసి వాళ్ళను ఆ పొలంలో మాటుగా ఉంచాడు. అతడు చూస్తుండగా ప్రజలు పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు గనుక అతడు వాళ్ళమీద పడి వాళ్ళని చంపేశాడు.
౪౪ అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్ళి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఆ రెండు గుంపులు పరుగెత్తి పొలాల్లో ఉన్న వాళ్ళందరినీ మట్టుపెట్టారు. ౪౫ ఆ రోజంతా అబీమెలెకు ఆ ఊరివారితో యుద్ధం చేసి ఊరిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మనుషులను చంపి, పట్టణాన్ని పడగొట్టి ఆ ప్రాంతమంతా ఉప్పు చల్లించాడు.
౪౬ షెకెము గోపుర నాయకులు ఆ వార్త విని, ఏల్ బెరీతు గుడి కోటలోకి చొరబడ్డారు. ౪౭ షెకెము నాయకులంతా అక్కడ పోగుపడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలిసి ౪౮ అతడు, అతనితో ఉన్న మనుషులందరూ, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు గొడ్డలి చేత పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ నరికి, యెత్తి భుజంపై పెట్టుకుని “నేనేం చేస్తున్నానో అదే మీరు కూడా చెయ్యండి” అని తనతో ఉన్న మనుషులతో చెప్పాడు. ౪౯ అప్పుడు ఆ మనుషులందరూ ప్రతివాడూ ఒక్కొక్క కొమ్మ నరికి అబీమెలెకు చేసినట్టుగానే ఆ కోట దగ్గర వాటిని పేర్చి, వాటితో ఆ కోటను తగలబెట్టారు. అప్పుడు షెకెము గోపుర యజమానులు, వాళ్ళల్లో ఉన్న స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చనిపోయారు.
౫౦ తరువాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి తేబేసును ముట్టడించి, దాన్ని పట్టుకున్నాడు. ౫౧ ఆ పట్టణం మధ్యలో ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు, పట్టణపు యజమానులు, అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకు ఎక్కారు. ౫౨ అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు. ౫౩ అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది. ౫౪ అప్పుడతను తన ఆయుధాలు మోసే సేవకుణ్ణి కంగారుగా పిలిచి “ఒక స్త్రీ నన్ను చంపిందని నన్ను గూర్చి ఎవరూ అనుకోకుండా, నీ కత్తి దూసి నన్ను చంపు” అని చెప్పాడు. ఆ సేవకుడు అతన్ని పొడవగా అతడు చచ్చాడు. ౫౫ అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులకు తెలియగానే ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళారు.
౫౬ ఆ విధంగా అబీమెలెకు తన డెబ్భైమంది సహోదరులను చంపడం వల్ల తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు మళ్ళీ అతని మీదకి రప్పించాడు. ౫౭ షెకెమువాళ్ళు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వాళ్ళ తలల మీదికి మళ్ళీ రప్పించాడు. యెరుబ్బయలు కుమారుడు యోతాము శాపం వాళ్ళ మీదకి వచ్చింది.