౨౪
౧ చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు.
౨ ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.
౩ దేశం కేవలం వట్టిదిగా అయి పోతుంది. అది కేవలం కొల్లసొమ్ము అవుతుంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
౪ దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు.
౫ లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.
౬ శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు.
౭ కొత్త ద్రాక్షారసం అంగలారుస్తున్నది. ద్రాక్షావల్లి వాడి పోతున్నది. ఆనంద హృదయులంతా నిట్టూర్పు విడుస్తున్నారు. తంబురల సంతోషనాదం నిలిచిపోయింది.
౮ కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది.
౯ మనుషులు పాటలు పాడుతూ ద్రాక్షారసం తాగరు. పానం చేసేవారికి మద్యం చేదైపోయింది. ౧౦ అల్లకల్లోలమైన పట్టణం నిర్మూలమై పోయింది. ఎవరూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూతబడింది.
౧౧ ద్రాక్షారసం లేదని పొలాల్లో ప్రజలు కేకలు వేస్తున్నారు. సంతోషమంతా ఆవిరై పోయింది. దేశంలో ఆనందం లేదు.
౧౨ పట్టణంలో శైథిల్యం మాత్రం మిగిలింది. గుమ్మాలు విరిగి పోయాయి.
౧౩ ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది.
౧౪ శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు.
౧౫ దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
౧౬ నీతిమంతునికి స్తోత్రమని, భూదిగంతాల నుండి సంగీతాలు మనకు వినబడ్డాయి. అప్పుడు నేను “అయ్యో నాకు బాధ. నేను చెడిపోయాను, చెడిపోయాను. మోసం చేసే వారు మోసం చేస్తారు మోసం చేసే వారు ఎంతో మోసం చేస్తారు” అన్నాను.
౧౭ భూనివాసులారా, మీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి మీకు దాపురించాయి.
౧౮ తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి.
౧౯ భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది.
౨౦ భూమి మత్తెక్కిన వాడిలాగా అదే పనిగా తూలుతోంది. పాకలాగా ఇటు అటు ఊగుతోంది. దాని అపరాధం దాని మీద భారంగా ఉంది. అది పడి ఇక లేవదు.
భయంకరమైన వార్త విని పారిపోయే వాడు గుంటలో పడిపోతాడు. గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కుతాడు.
౨౧ ఆ దినాన యెహోవా ఉన్నత స్థలాల్లోని ఉన్నత స్థల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తాడు.
౨౨ బందీలు గోతిలో పోగు పడినట్టు చెరసాల్లో పడతారు. చాలా రోజులైన తరువాత వారికి తీర్పు జరుగుతుంది.
౨౩ చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.