౧౭
౧ యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు. ౨ దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు. ౩ ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.
౪ అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు. ౫ అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. ౬ నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. ౭ అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.
౮ తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ౯ మోషే యెహోషువతో “మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.
౧౦ యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు. ౧౧ మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు. ౧౨ మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు. ౧౩ ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.
౧౪ అప్పుడు యెహోవా మోషేతో “చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను” అన్నాడు. ౧౫ తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు. ౧౬ “యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది” అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.