౨౭
౧ మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. “ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. ౨ మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. ౩ మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.
౪ మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. ౫ అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు.
౬ చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి. ౭ మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి. ౮ ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి.
౯ మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి. ౧౦ ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి.
౧౧ ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, ౧౨ బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి. ౧౩ రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.
౧౪ అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.”
“యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో ౧౫ మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౧౬ “తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౧౭ “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౧౮ “గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౧౯ “పరదేశికి గానీ, తండ్రి లేనివాడికిగానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౦ “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౧ “ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౨ “తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౩ “తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౪ “రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౫ “నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
౨౬ “ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.