౧౧
పేతురు యూదేతరుల మధ్య తన పరిచర్యను సమర్థించుకోవడం
౧ యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు. ౨ పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, ౩  “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
౪ అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ, ౫  “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది. ౬ దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
౭ అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకొని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. ౮ అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను. ౯ రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది. ౧౦ ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
౧౧ వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. ౧౨ అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. ౧౩ అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు. ౧౪ నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.
౧౫ నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. ౧౬ అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
౧౭  “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. ౧౮ వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
అంతియొకయ సంఘం. విశ్వాసుల కొత్త పేరు
౧౯ స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. ౨౦ వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. ౨౧ ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. ౨౨ వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
౨౩ అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు. ౨౪ అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు. ౨౫ బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకొని వచ్చాడు. ౨౬ వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.
అంతియొకయ సంఘం యెరూషలేము విశ్వాసుల కోసం సహాయం పంపడం
౨౭ ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. ౨౮ వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. ౨౯ అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహాయం పంపడానికి నిశ్చయించుకున్నారు. ౩౦ వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.