౧౩
౧ మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి.” ౨ నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసిన వారికీ మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ వస్తే, నేను వారిని వదిలి పెట్టను. ౩ క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిశాలిగా ఉన్నాడు.
౪ బలహీనతను బట్టి ఆయనను సిలువ వేశారు గాని, దేవుని శక్తిని బట్టి ఆయన సజీవుడుగా ఉన్నాడు. మేము కూడా ఆయనలో బలహీనులమైనా, మీతో మాట్లాడేటప్పుడు మాత్రం దేవుని శక్తితో జీవం కలిగి ఉంటాము.
౫ మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు. ౬ మేము పరీక్షలో ఓడిపోయే వారం కామని మీరు తెలుసుకోగలరని నా నమ్మకం. ౭ మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము యోగ్యులంగా కనబడాలని కాదు గాని, మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేయాలని మా ఉద్దేశం. ౮ మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.
౯ మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్నారని సంతోషిస్తున్నాము. మీరు సంపూర్ణులు కావాలని కూడా ప్రార్థిస్తున్నాం. ౧౦ అందువల్లే నేను దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మిమ్మల్ని పడగొట్టడానికి కాక, కట్టడానికే యిచ్చాడు.
ముగింపు
౧౧ చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనసుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.
౧౨ పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు అభివందనాలు చెప్పుకోండి. ౧౩ పరిశుద్ధులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.
౧౪ ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.