౨౭
౧ యోతాము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా. ౨ యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతని కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. ౩ అతడు యెహోవా మందిర పై ద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలావరకూ కట్టించాడు. ౪ అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.
౫ అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు. ౬ యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యధార్థం ప్రవర్తించాడు కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు ౭ యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్దాలన్నిటినీ గురించి, అతని పద్ధతులను గురించి, ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసివున్నాయి. ౮ అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. ౯ యోతాము కన్ను మూసి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు.