౨౨
౧ సిరియాకూ ఇశ్రాయేలుకూ మధ్య మూడేళ్ళు యుద్ధం జరగలేదు. ౨ మూడో సంవత్సరం యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. ౩ ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి “రామోత్గిలాదు మనదని మీకు తెలుసు. అయితే మనం దాన్ని సిరియా రాజు చేతిలోనుంచి తీసుకోడానికి ప్రయత్నమేమీ చేయడం లేదు” అన్నాడు. ౪ అతడు “యుద్ధానికి నాతో పాటు నీవు రామోత్గిలాదు వస్తావా?” అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు “నువ్వేదంటే అదే. మా వాళ్ళు నీవాళ్ళే. నా గుర్రాలు నీ గుర్రాలే” అని ఇశ్రాయేలు రాజుతో అన్నాడు.
౫ యెహోషాపాతు “ముందు యెహోవా ఇష్టాన్ని తెలుసుకుందాం” అన్నాడు. ౬ ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి “యుద్ధానికి రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా, వద్దా?” అని వారినడిగాడు. వాళ్ళు “వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు” అన్నారు. ౭ అయితే యెహోషాపాతు “మనం సలహా తీసుకోడానికి వీళ్ళు తప్ప, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
౮ అందుకు ఇశ్రాయేలు రాజు “ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందననే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం” అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు “రాజైన మీరు అలా అనొద్దు” అన్నాడు. ౯ అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక అధికారిని పిలిచి “ఇమ్లా కొడుకు మీకాయాను వెంటనే ఇక్కడికి తీసుకురండి” అని ఆదేశించాడు. ౧౦ ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకుని, సమరయ ముఖద్వారం దగ్గరున్న బహిరంగ స్థలం లో తమ సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రవక్తలంతా వారి ఎదుట ప్రవచిస్తూ ఉన్నారు.
౧౧ కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు” అన్నాడు. ౧౨ ప్రవక్తలంతా అలాగే ప్రవచిస్తూ “యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ వశం చేస్తాడు. కాబట్టి నీవు దాని మీదికి వెళ్లి గెలువు” అన్నారు. ౧౩ మీకాయాను పిలవడానికి వెళ్ళిన వార్తాహరుడు అతనితో “ప్రవక్తలంతా ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే మంచి మాటలు చెప్పు” అన్నాడు.
౧౪ మీకాయా “యెహోవా జీవం తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను” అన్నాడు. ౧౫ అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు “మీకాయా, యుద్ధం చేయడానికి మేము రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా వద్దా” అని అడిగాడు. మీకాయా “యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు, కాబట్టి దాని మీదికి వెళ్లి గెలువు” అని జవాబిచ్చాడు. ౧౬ అందుకు రాజు “నీతో ప్రమాణం చేయించి యెహోవా పేరును బట్టి, సత్యమే చెప్పాలని నేనెన్నిసార్లు నీతో చెప్పాలి?” అన్నాడు. ౧౭ మీకాయా “ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదరి పోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్లిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు.
౧౮ అప్పుడు ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతుతో “ఇతడు నా గురించి మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడే జరుగుతుందని ప్రవచిస్తాడని నేను నీతో చెప్పలేదా” అన్నాడు. ౧౯ అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు. ౨౦ ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.
౨౧ అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు. ౨౨ అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు. ౨౩ చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
౨౪ కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు” అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు. ౨౫ అందుకు మీకాయా “దాక్కోడానికి నీవు లోపలి గదుల్లోకి చొరబడే రోజున తెలుసుకుంటావు” అన్నాడు. ౨౬ అప్పుడు ఇశ్రాయేలు రాజు “మీకాయాను పట్టుకుని తీసికెళ్లి పట్టాణాధికారి ఆమోనుకూ, నా కొడుకు యోవాషుకూ అప్పచెప్పండి. ౨౭ వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.”
౨౮ అప్పుడు మీకాయా “నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్నట్టే. ఓ ప్రజలారా, ఈ విషయం వినండి” అన్నాడు.
౨౯ ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు, రామోత్గిలాదు మీదికి వెళ్ళారు. ౩౦ ఇశ్రాయేలురాజు “నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వైతే నీ రాజ వస్త్రాలు ధరించుకో” అని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ౩౧ సిరియారాజు తన రథాల మీద అధికారులైన ముప్ఫై రెండు మందిని పిలిపించి “సాధారణ సైనికులతో గానీ ప్రధాన సైనికులతో గానీ మీరు యుద్ధం చేయొద్దు. ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయండి” అన్నాడు.
౩౨ రథాధిపతులు యెహోషాపాతును చూసి “కచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనితో యుద్ధం చేయడానికి అతని మీదికొచ్చారు. యెహోషాపాతు పెద్దగా కేకలు పెట్టాడు. ౩౩ రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మానేశారు. ౩౪ అయితే ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే బాణం వేస్తే అది ఇశ్రాయేలు రాజు కవచం అతుకు మధ్య తగిలింది. కాబట్టి అతడు “నాకు పెద్ద గాయమైంది. రథం తిప్పి ఇక్కడనుంచి నన్ను అవతలకు తీసుకు పో” అని తన సారథితో చెప్పాడు.
౩౫ ఆరోజు యుద్ధం తీవ్రంగా జరుగుతుంటే, సిరియనులకు ఎదురుగా, రాజు తన రథంలో ఉండిపోయాడు. సాయంకాలానికి అతడు చనిపోయాడు. అతని గాయం నుంచి రక్తం కారి రథం అడుగున నిలిచింది. ౩౬ సాయంకాలం “అందరూ తమ తమ పట్టణాలకూ ప్రాంతాలకూ వెళ్లిపోవచ్చు” అని సైన్యమంతా వార్త పాకిపోయింది. ౩౭ ఆ విధంగా రాజు చనిపోయాడు. వాళ్ళు అతన్ని సమరయకు తీసుకు వచ్చారు. అతణ్ణి సమరయలో పాతిపెట్టారు. ౩౮ వేశ్యలు స్నానం చేసే ఒక కొలను దగ్గర అతని రథాన్ని కడిగారు. యెహోవా చెప్పినట్టు కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి.
౩౯ అహాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా అతడు కట్టించిన దంతపు గృహాన్ని గురించి, అతడు కట్టించిన పట్టణాలన్నిటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. ౪౦ అహాబు చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని కొడుకు అహజ్యా అతని బదులు రాజయ్యాడు.
౪౧ ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలెట్టాడు. ౪౨ యెహోషాపాతు పరిపాలించడం మొదలెట్టినప్పుడు అతడు ముప్ఫై అయిదేళ్ళ వాడు. యెరూషలేములో అతడు ఇరవై ఐదేళ్ళు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు. ౪౩ అతడు తన తండ్రి, ఆసా విధానాన్ని అనుసరించి, యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించాడు. అయితే ఉన్నత పూజా స్థలాలను తీసేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.
౪౪ యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. ౪౫ యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు చూపించిన బల ప్రభావాలు, యుద్ధం చేసిన పద్ధతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ౪౬ తన తండ్రి ఆసా రోజుల్లోనుంచి మిగిలి ఉన్న మగ వ్యభిచారులను అతడు దేశం నుంచి వెళ్లగొట్టాడు. ౪౭ ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. ఒక అధికారి పాలించేవాడు.
౪౮ యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరు దేశానికి వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గానీ ఆ ఓడలు బయలుదేర లేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలై పోయాయి. ౪౯ అప్పుడు అహాబు కొడుకు అహజ్యా “నా సేవకులను నీ సేవకులతో పాటు ఓడల మీద వెళ్ళనివ్వండి” అని యెహోషాపాతును అడిగాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు. ౫౦ యెహోషాపాతు చనిపోగా తన పూర్వీకుడైన దావీదు పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.
౫౧ అహాబు కొడుకు అహజ్యా యూదారాజు యెహోషాపాతు పరిపాలన 17 వ సంవత్సరం సమరయలో ఇశ్రాయేలును పరిపాలించడం మొదలుపెట్టి రెండేళ్ళు ఇశ్రాయేలును పాలించాడు. ౫౨ అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. తన తలిదండ్రులిద్దరి ప్రవర్తననూ ఇశ్రాయేలు ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాము ప్రవర్తననూ అనుసరించాడు. ౫౩ అతడు బయలు దేవుడికి మొక్కి, పూజిస్తూ తన తండ్రి చేసిందంతా చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు.