౧౪
౧ అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది. ౨ యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు. ౩ కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”
౪ యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు. ౫ యెహోవా అహీయాతో “యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి” అన్నాడు. ౬ గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు.
“యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు. ౭ నీవు వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను. ౮ దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి, నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు. ౯ దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీ కోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు, పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు.
౧౦ కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను. ౧౧ పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది, యెహోవానైన నేనే.’ ౧౨ కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు. ౧౩ అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడిలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది.
౧౪ అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు. ౧౫ ఇశ్రాయేలువారు ఆషేరా దేవతాస్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు. ౧౬ తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.”
౧౭ అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు. ౧౮ యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఖించారు. ౧౯ యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. ౨౦ యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు.
౨౧ యూదాదేశంలో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయస్సులో పరిపాలించడం మొదలెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణంలో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.
౨౨ యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు. ౨౩ వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు. ౨౪ యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.
౨౫ రెహబాము రాజు పాలిస్తున్న ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తాడు. ౨౬ యెహోవా మందిరపు ఖజనాలోని వస్తువులు, రాజభవనపు ఖజనాలోని వస్తువులు, అన్నిటినీ దోచుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను కూడా అతడు దోచుకుపోయాడు. ౨౭ రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి, రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకునికి అప్పచెప్పాడు. ౨౮ రాజు యెహోవా మందిరానికి వెళ్ళే ప్రతిసారీ భటులు వాటిని మోసుకు పోయేవారు. తరువాత వాటిని భద్రమైన గదిలో ఉంచేవారు.
౨౯ రెహబాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ౩౦ బ్రతికినంత కాలం రెహబాముకూ యరొబాముకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ౩౧ రెహబాము చనిపోయినప్పుడు దావీదు నగరంలోని అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని తల్లి నయమా అమ్మోనీయురాలు. అతని కొడుకు అబీయా అతని స్థానంలో రాజయ్యాడు.