1 John
యోహాను రాసిన మొదటి పత్రిక
౧
కుటుంబానికి తండ్రితో సహవాసం (క్రీస్తు అవతారం వల్ల సహవాసం సాధ్యమైంది)
౧ ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. ౨ ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం.
సహవాసం తండ్రితో, కుమారుడితో కూడా
౩ మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. ౪ మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.
సహవాసానికి షరతు: వెలుగులో నడవాలి
౫ దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. ౬ మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. ౭ అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
లోపలున్న పాపాన్ని గుర్తించాలి
౮ మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
పాపం ఒప్పుకోలు, క్షమాపణ, శుద్ధి
౯ కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. ౧౦ మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.