13
నెహెమ్యా చివరి ఆదేశాలు
ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింప బడరన్న నిబంధన మెషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు. ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.
4-5 అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్వాషీబు టొబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు ఎల్వాషీబు దేవుని ఆలంయంలో వస్తువులను భద్రపరచే గదులకు బాధ్యుడైన యాజకుడు. ఎల్యాషీబు టోబీయాకి సన్నిహిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగ్రి, ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తుపులు దాచేందుకు ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాలకుల కోసం పంట ధాన్యాల్లో పదోపంతు కొత్త ద్రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి ఇచ్చాడు.
ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజుగారిని కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజుగారిని యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను. అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు! ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను. ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.
10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ సొంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు. 11 అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను. 12 తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వసువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.
13 ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.
14 దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.
15 ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జ నం ద్రాక్షాను, అత్తిపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మ కూడదని చెప్పాను.
16 తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు. 17 యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొర పాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు. 18 మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”
19 అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా సొంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.
20 ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లిర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది. 21 అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లిర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.
22 తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా.
నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.
23 ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. 24 ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముందికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు. 25 అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి. 26 ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణభూతమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమెను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. 27 మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”
28 యోయూదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయూదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.
29 ఓ నా దేవా, నువ్వు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నువ్వు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు. 30 అందుకని నేనా యాజకులనూ, లేవియులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తోలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను. 31 జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను.
ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.