4
యెరూషలేమునుండి న్యాయం రావటం
చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
 
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
యెహోవా అనేకా జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రలుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగ గొట్టిచెట్లను నరికే పనిముల్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాలతల క్రింద,
అంజూరపు చెట్టుక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహావా ఇది చెప్పాడు!
 
అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
రాజ్యం తిరిగి పొందబడటం
యెహోవా చెపుతున్నాడు,
“యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది.
యెరూషలేము అవతలకు విసిరివేయబడింది.
యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది.
అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
 
“ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు.
ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు.
కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తారు.”
యెహోవా వారికి రాజుగా ఉంటాడు.
ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
ఓ మందల కావలిదుర్గమా,
ఓ సీయోను కుమార్తె పర్వతమైన
ఓఫెలూ, గతంలోమాదిరి
నీవొక రాజ్యంగా రూపొందుతావు.
అవును, సీయోను కుమారీ,
ఆ రాజ్యం నీకు వస్తుంది.
ఇశ్రాయేలీయులు బాబిలోనియాకు ఎందుకు వెళ్లాలి?
నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు?
నీ రాజు వెళ్లిపోయాడా?
నీ నాయకుని నీవు కోల్పోయావా?
ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.
10 సీయోను కుమారీ, నీవు బాధపడు.
ప్రసవించే స్త్రీలా నీవు ప్రసవించి “బిడ్డను” కను.
ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు.
నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు.
నీవు బబులోనుకు (బాబిలోనియా) వెళతావు.
కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు.
యెహోవా అక్కడికి వెళ్లి నిన్ను
నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
యెహోవా ఇతర దేశాలను నాశనం చేయుట
11 అనేక దేశాలు నీ మీద యుద్ధానికి వచ్చాయి.
“సీయోను వైపు చూడు!
దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
 
12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు.
కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు.
యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు.
కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్క బడతారు.
ఇశ్రాయేలు శత్రువులను ఓడించి జయించటం
13 “సీయోను కుమారీ లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు.
నేను నిన్ను బాగా బలపర్చుతాను.
నీకు ఇనుప కొమ్ములు, కంచుగిట్టలు ఉన్నట్లువుతుంది.
అనేకమంది జనులను నీవు ముక్కలుగాచి తకగొడతావు.
వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను.
వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియయైన యెహోవాకు సమర్పిస్తాను.”