17
జంతువులను చంపి తినటాన్ని గూర్చిన నియమాలు
1 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు. 3 ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను లేక గొర్రెపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస వెలుపలగానీ చంపవచ్చును. 4 ఆ వ్యక్తి ఆ జంతువును సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ జంతువుయొక్క ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు అర్పించాలి. ఆ వ్యక్తి దాని రక్తాన్ని చిందించాడు. కనుక అతడు తన కానుకను యెహోవా పవిత్ర గుడారానికి తీసుకొని వెళ్లాలి. ఆ జంతువులో ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు తీసుకొని వెళ్లకపోతే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 5 ప్రజలు వారి సమాధాన బలిని యెహోవాకు అర్పించేందుకే ఈ నియమం. ఇశ్రాయేలు ప్రజలు పొలాల్లో చంపే జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతువులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహోవాకు అర్పించాలి. ఆ జంతువులను వారు యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. 6 అప్పుడు ఆ జంతువుల రక్తాన్ని సన్నిధి గుడారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు చల్లుతాడు. మరియు ఆ జంతువుల కొవ్వును బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 7 వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.
8 “ప్రజలతో చెప్పు: ఒక ఇశ్రాయేలు పౌరుడు లేక ఒక యాత్రికుడు, లేక మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయుడు దహన బలిగాని ప్రాయశ్చిత్త బలిగాని అర్పించవచ్చు. 9 ఆ వ్యక్తి తన బలిని సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ దానిని యెహోవాకు అర్పించాలి. ఆ వ్యక్తి యిలా చేయకపోతే, అతడు తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.
10 “రక్తాన్ని తినే వాళ్లకు నేను విరోధిని. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను వేరు చేస్తాను. 11 ఎందుచేతనంటే దేహానికి ప్రాణం రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించే నియమాలు నేను మీకు ఇచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొనేందుకు మీరిలా చేయాలి. మీరు తీసిన ప్రాణానికి విలువ చెల్లింపుగా ఆ రక్తాన్ని మీరు నాకు యివ్వాలి. 12 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పేది ఇదే: మీలో ఎవ్వరూ రక్తం తినవద్దు. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తం తినకూడదు.
13 “తినదగిన జంతువును లేక పక్షిని ఎవరైనా పట్టుకొంటే, ఆ వ్యక్తి దాని రక్తాన్ని నేలమీద పోసి మట్టితో కప్పివేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. 14 మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే.
15 “మరియు దానంతట అదే చచ్చిన జంతువును తిన్నవాడుగాని, లేక మరో జంతువుచే చంపబడ్డ జంతువును తిన్నవాడుగాని ఆ సాయంత్రం వరకు అపవిత్రుడుగా వుంటాడు. ఆవ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్లతో పూర్తి స్నానం చేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చును, లేక మీ మధ్య నివసిస్తున్న విదేశీయుడు కావచ్చును. 16 ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోక పోయినా, స్నానం చేయకపోయినా అతడు పాపం చేత దోషిగా ఉంటాడు.”