22
మూడు వంశాలు ఇండ్లకు వెళ్లటం
1 అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ. 2 యెహోషువ వారితో అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు. 3 ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. 4 ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది. 5 అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.”
6 తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. 7 బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధం వంశంవారికి యోర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికివారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు. 8 “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు.
9 కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
10 రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో యోర్దాను నది దగ్గర ఉంది. ఆ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు. 11 కానీ ఈ మూడు వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది. 12 ఈమూడు వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం చేయాలని నిర్ణయం చేసారు.
13 కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపించారు. యాజకుడు ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు. 14 వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు.
15 కనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మట్లాడటానికి వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు: 16 “ఇశ్రాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు తెలుసు. 17 పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం మూలంగా నేటికీ మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడ శ్రమపడుతున్నాం. 18 ఇప్పుడు మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తాన్న దానిని మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా యెహోవా కోపగిస్తాడు.
19 “ ‘ఆరాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యెహోవకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించవద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది.
20 “ ‘జెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞకు ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలంతా శిక్షపొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.’ ”
21 రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పదకొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే: 22 “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు. 23 మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించిఉంటే, మమ్ముల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధానబలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము? 24 మేము కూడ మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవాను మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు. 25 యోర్దాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యోర్దాను నది మనల్ని వేరు చేస్తుందని దీని అర్థం. మీ పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని పాలించినప్పుడు, మేమూ మీ వాళ్లమేనని వారికి జ్ఞాపకం ఉండదు. ‘రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యను చెందినవారు కారు’ అని మాతో వారు అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు.
26 “అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలచలేదు. 27 మీరు ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తామని మీకు, మాకు, మనభవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం ఋజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాము. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు, మీవలెనే మేము కూడ ఇశ్రాయేలీయులం అని తెలుసుకోవాలని మా కోరిక. 28 ముందు నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే ‘చూడండి! మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేమూ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక భాగమే అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది’ అని మా పిల్లలు చెప్పగలుగుతారు.
29 “వాస్తవంగా మేము యోహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యోహోవా దేవునిది.”
30 రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయకులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబతున్నారని వారు తృప్తిపడ్డారు. 31 కనుక యాజకుడు ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము సంతోషిస్తున్నాము” అన్నాడు.
32 అప్పుడు ఫీనేహాసు, తదితర నాయకులు ఆ చోటువిడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి జరిగినది వారికి తెలియజేసారు. 33 ఇశ్రాయేలు ప్రజలు కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదికి యుద్ధానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించారు.
34 మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “ఋజువు” అని పేరు పెట్టారు.