35
ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
 
“యోబూ, నీవు యోబు అనే నేను
‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని చెప్పటం న్యాయం కాదు.
యోబూ, నీవు దేవుణ్ణి,
‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు?
నా పాపం నిన్నెలా బాధిస్తుంది?
నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.
 
“యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
యోబూ, పైన ఆకాశం చూడు.
పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టదు.
ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.
యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు.
నీనుండి దేవునికి ఏమీ రాదు.
యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి.
(అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)
 
“మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు.
శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.
10 కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు.
‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.
11 సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు.
జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’
 
12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు.
కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.
13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అదినిజం.
సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.
14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు,
దేవుడు నీ మాట వినడు.
దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు కొనే అవకాశంకోసం
నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
 
15 “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ,
పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.
16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు.
యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”