51
యెహోవా ఇలా చెపుతున్నాడు,
“నేనొకపెనుగాలి వీచేలా చేస్తాను.
అది బబులోను, కల్దీయ ప్రజల మీదికి వీచేలా చేస్తాను.
బబులోనును తూర్పార బట్టటానికి నేను కొత్త వారిని పంపుతాను.
వారు బబులోనును తూర్పార బడతారు. వారు బబులోనునుండి ప్రతీది తీసుకొంటారు.
సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టుతాయి.
భయంకరమైన విధ్వంసకాండ జరుగుతుంది.
బబులోను సైనికులు తమ ధనుర్బాణాలను వినియోగించలేరు.
ఆ సైనికులు తమ కవచాలను కూడ ధరించలేరు.
బబులోను యువకులను గురించి విచారించవద్దు.
దాని సైన్యాన్ని సర్వ నాశనం చేయుము.
బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు.
బబులోను వీధుల్లో వారు తీవ్రంగా గాయపర్చబడతారు.”
 
సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును, యూదాను ఒక విధవరాలివలె ఒంటరిగా వదిలి వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు.
లేదు! ఆ ప్రజలే ఇశ్రాయేలు పవిత్ర దైవాన్ని వదిలివేసిన పాపానికి ఒడిగట్టారు.
వారే ఆయనను వదిలారు గాని
ఆయన వారిని విడిచివేయలేదు.
 
బబులోను నుంచి పారిపొండి.
మీ ప్రాణ రక్షణకై పారిపొండి!
మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు!
వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది.
బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.
యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది.
బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది.
బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి.
కావున వారికి వెర్రి పట్టింది.
బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది.
దాని కొరకు విలపించండి!
దాని బాధ నివారణకు మందుతెండి!
బహుశః ఆమెకు నయం కావచ్చు!
 
బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము.
కాని ఆమె స్వస్థతనొందలేదు.
కావున ఆమెను వదిలివేసి
మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం.
వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు.
బబూలోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.
10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు.
రండి! ఈ విషయం మనం సీయోనులో చెప్పుదాం.
మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం.
 
11 మీ బాణాలకు పదును పెట్టండి.
మీ డాళ్లను చేపట్టండి!
యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు.
ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు.
కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు.
బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు.
బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది.
కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.
12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగురవేయండి.
ఎక్కువమంది కావలివారిని నియమించండి.
రక్షణ భటులను వారి వారి స్థానాలలో నిలపండి.
రహస్య దాడికి సిద్ధంగా ఉండండి!
యెహోవా తను యోచించిన ప్రకారం చేస్తాడు.
యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అది చేసి తీరుతాడు.
13 బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు.
నీవు ధనధాన్యాలతో తులతూగుతున్నావు.
కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే కాలం అంతమవుతూవుంది.
నీకు వినాశనకాలం దాపురించింది.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు,
“బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు.
ఆ సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు.
వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”
 
15 యెహోవా తన అనంత శక్తి నుపయోగించి భూమిని సృష్టించాడు.
ఆయన తన జ్ఞానాన్ని వినియోగించి ప్రపంచాన్ని నిర్మించాడు.
తన ప్రజ్ఞతో ఆయన ఆకాశాన్ని విస్తరించాడు.
16 ఆయన గర్జస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషిస్తాయి.
భూమిపైకి మేఘాలను ఆయన పంపిస్తాడు.
ఉరుములు మెరుపులతో వర్షం పడేలా చేస్తాడు.
తన గిడ్డంగుల నుండి ఆయన పెనుగాలులు రప్పిస్తాడు.
17 కాని ప్రజలు బహుమూర్ఖులు.
దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు.
నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు.
ఆ విగ్రహాలన్నీ బూటకపు దేవతలే.
కావున ఆ పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి.
ఆ విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.
18 ఆ విగ్రహాలు నిరుపయోగం!
ప్రజలు చేసిన ఆ విగ్రహాలు నవ్వులాట బొమ్మలు!
వారికి తీర్పు తీర్చే కాలం వస్తుంది.
అప్పుడా విగ్రహాలు నాశనం చేయబడతాయి.
19 కాని యెకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు.
ప్రజలు దేవుని చేయలేదు.
దేవుడే తన ప్రజలను చేశాడు!
దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు!
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
 
20 యెహోవా ఈ విధంగా అంటున్నాడు: “బబులోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి
రాజ్యాలను మోదటానికి నిన్ను వినియోగించాను.
సామ్రాజ్యాలను నాశనం చేయటానికి నిన్ను వాడాను.
21 గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను.
రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయోగించాను.
22 స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను.
వృద్ధులను, యువకులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.
యువకులను, యువతులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.
23 గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను.
రైతులను, ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయోగించాను.
పాలకులను, ముఖ్య అధికారులను దండించటానికి నిన్ను వాడాను.
24 కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను.
యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
 
25 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోనూ, నీవొక విధ్వంసకర పర్వతానివి.
నేను నీకు వ్యతిరేకిని.
బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనంచేశావు.
నేను నీకు విరోధిని. నీ మీదికి నా చేయి చాస్తున్నాను.
కొండ శిఖరాల నుంచి నిన్ను దొర్లిస్తాను.
నిన్నొక కాలిపోయిన కొండలా చేస్తాను.
26 పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు చూడరు.
వారి భవనాల పునాదులకు ప్రజలు పెద్ద రాళ్లను బబులోను నుంచి తీసికొనిపోరు.
ఎందువల్లనంటే శ్వతంగా ఈ నగరం ఒక నలిగిన రాళ్లపోగులా మారుతుంది.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
 
27 “రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి!
దేశాలన్నిటిలో బూర వూదండి!
బబులోనుతో యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి!
బబులోనుతో యుద్ధానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవండి.
దాని మీదికి సైన్యాన్ని నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి.
మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను పంపండి.
28 దానిమీదకి యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి.
మాదీయుల రాజులను సమాయత్తపర్చండి.
మాదీయుల పాలకులను, ముఖ్యాధికారులను సిద్ధంచేయండి.
వారు పాలించే దేశాలన్నిటినీ బబులోను మీద యుద్ధానికి సిద్ధంచేయండి.
29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణకిపోతుంది.
యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది.
బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం.
అక్కడ ఎవ్వరూ నివసించరు.
30 బబులోను సైనికులు పోరాడటం మానివేశారు.
వారు తమ కోటల్లోనే ఉండిపోయారు.
వారి శక్తి తరిగిపోయింది.
వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు.
బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి.
దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.
31 ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు.
దూత తరువాత దూత వస్తాడు.
అతని నగరమంతా పట్టుబడిందని
వారు బబులోను రాజుకు తెలియజేస్తారు.
32 మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి.
చిత్తడి నేలలు సహితం మండుతున్నాయి.
బబులోను సైనికులంతా భయపడ్డారు.”
 
33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది.
పంటకోయు కాలంలో రైతులు కోసిన పైరును కొట్టి పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు.
బబులోనును కొట్టే కాలం దగ్గర పడుతోంది.”
 
34 “గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు.
గతంలో నెబుకద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు.
ఇదివరలో అతడు మా ప్రజలను చెరగొన్నాడు.
మేము వట్టి జాడీల్లా అయ్యాము.
అతడు మాకున్న మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు.
కడుపు పగిలేలా అన్నీ తిన్న బ్రహ్మరాక్షసిలా అతడున్నాడు.
అతడు మా మంచి వస్తువులన్నీ
తీసికొని మమ్మల్ని నెట్టివేశాడు.
35 మమ్మల్ని బాధించటానికి బబులోను భయర కరమైన పనులు చేసింది.
ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.”
 
సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు:
“బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు.
వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.”
యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.
36 కావున యెహోవా ఇలా చెపుతున్నాడు,
“యూదా, నిన్ను రక్షిస్తాను.
బబులోను తప్పక శిక్షింపబడేలా చేస్తాను.
బబులోను సముద్రం ఎండిపోయేలా చేస్తాను.
ఆమె ఊటలు ఎండిపోయేలా నేను చేస్తాను.
37 బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా తయారవుతుంది.
బబులోను పిచ్చికుక్కలు తిరుగాడే స్థలంగా మారుతుంది.
ఆ రాళ్లగుట్టను చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. బబులోనును చూచి జనులు బాధతో తల లాడిస్తారు.
బబులోను నిర్మానుష్యమై పోతుంది.
38 బబులోను ప్రజలు గర్జించు యువ సింహాల్లా ఉన్నారు.
వారు పులి పిల్లల్లా గుర్రుమంటున్నారు.
39 ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు.
వారికి నేనొక విందు. ఇస్తాను.
వారు బాగా మద్యం సేవించేలా చేస్తాను.
వారు నవ్వుతూ విలాసంగా కాలక్షేపం చేస్తారు.
తరువాత వారు శాశ్వతంగా నిద్రపోతారు.
వారిక మేల్కొనరు.”
 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
40 “బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని వెళతాను.
నరకబడటానికి వేచివుండే గొర్రెల్లా, పొట్టేళ్లలా, మేకల్లా బబులోను ప్రజలుంటారు.
 
41 “షేషకు ఓడింపబడుతుంది.
అత్యుత్తమమైన, గర్వించదగిన దేశం చెరబట్టబడుతుంది.
ఇతర రాజ్యాల ప్రజలు బబులోనువైపు చూస్తారు.
వారు చూసే విషయాలు వారిని భయపెడతాయి.
42 బబులోను మీదికి సముద్రం పొంగివస్తుంది.
ఘోషించే అలలు దానిని ముంచివేస్తాయి.
43 బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవుతాయి.
బబులోను భూమి ఎండి ఎడారిలా మారుతుంది.
అది నిర్మానుష్యమైన భూమి అవుతుంది.
కనీసం ప్రజలు బబులోను గుండానైనా పయనించరు.
44 బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను.
తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా చేస్తాను.
ఇతర రాజ్యాల వారు బబులోనుకు రారు.
బబులోను నగరపు చుట్టున్న ప్రాకారం కూలిపోతుంది.
45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి.
మీ ప్రాణరక్షణకు పారిపొండి.
యెహోవా యొక్క భయానక కోపంనుండి దూరంగా పారిపొండి.
 
46 “నా ప్రజలారా, విచారించకండి.
వదంతులు వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు.
ఒక వదంతి ఈ సంవత్సరం వ్యాపిస్తుంది.
మరొక వదంతి మరు సంవత్సరం వస్తుంది.
దేశంలో భీకరపోరాటం గురించిన వదంతులు లేస్తాయి.
పాలకులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్లు వదంతులు వస్తాయి.
47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది.
బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది.
అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.
48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత
బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు.
శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి
గనుక వారునూ కేకలు పెడతారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
 
49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది.
భూమి మీద ప్రతి ప్రాంతంనూ ప్రజలలోని బబులోను చంపింది.
కావున బబులోను తప్పక పతనమవ్వాలి!
50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి;
బబులోనును వదిలిపొండి.
ఆగకండి!
మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు.
కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసికొనండి.
 
51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము.
మేము అవమానింపబడినందున మేము సిగ్గుపడుతున్నాము.
అది ఎందువల్లనంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయంలోని
పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.”
 
52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను
నేను శిక్షించే సమయం వస్తోంది.
ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా
గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.
53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు.
బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు
కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను.
ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
 
54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనంవినగలం.
కల్దీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం.
55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు.
నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు.
మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు.
చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.
56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది.
బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి.
ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు.
వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.
57 బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను,
జ్ఞానులను మత్తిల్లజేస్తాను.
దాని పాలకులను, అధికారులను,
సైనికులను కూడ మత్తిల్లజేస్తాను.
దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు.
వారు ఎప్పిటికీ మేల్కొనరు.”
ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
 
58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది.
దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి.
బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు.
కాని అది వారికి సహాయపడదు!
నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు.
కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”
యిర్మీయా బబులోనుకు సందేశం పంపుట
59 యిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరాయాకు* శెరాయా శెరాయా అనేవాడు యిర్మీయా కార్యదర్శియైన బారూకు సోదరుడు. పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో సిద్కియా … సంవత్సరంలో అనగా క్రీ. పూ. 594 సంవత్సరం. ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపించాడు. 60 బబులోనుకు సంభవించే భయంకర విషయాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు:
61 శెరాయాకు యిర్మీయా ఇలా చెప్పాడు, “శెరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్లు ఈ సమాచారం తప్పకుండా చదువు. 62 తరువాత, ‘ఓ దేవా, ఈ ప్రదేశమగు బబులోనును నీవు నాశనం చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివసించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. ఈ చోటు శాశ్వతంగా పట్టి శిథిలాలు పోగు అవుతుంది’ అని చెప్పు. 63 నీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు నదిలోకి విసురు. 64 అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవద్దు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది’ ” అని చెప్పు.
యిర్మీయా మాటలు సమాప్త.

*51:59: శెరాయా శెరాయా అనేవాడు యిర్మీయా కార్యదర్శియైన బారూకు సోదరుడు.

51:59: సిద్కియా … సంవత్సరంలో అనగా క్రీ. పూ. 594 సంవత్సరం.