34
యూదా రాజైన సిద్కియాకు హెచ్చరిక
1 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన కింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.
2 ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: యిర్మీయా, యూదా రాజైనా ‘సిద్కియా వద్దకు వెళ్లి ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా ఈ విధంగా తేలియ జెప్పుచున్నాడు: యెరూషలేము నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబెడతాడు! 3 సిద్కియా, బబులోను రాజు నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు. 4 కాని, యూదా రాజువైన సిద్కియా! యెహోవా వాగ్దానం శ్రద్ధగా వినుము. నిన్ను గురించి యెహోవా యిలా చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు. 5 నీవు ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. అదే రీతిగా ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు జరుపుతారు. వారు నీ కొరకు విలపిస్తారు. “అయ్యో, మా నాయకుడా!” అని విచారిస్తారు. నాకై నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను.’ ” ఇదే యెహోవా వాక్కు.
6 యెహోవా యొక్క ఈ సమాచారాన్ని యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా ఇచ్చాడు. 7 అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ప్రజలు ఒప్పందాలలో ఒక దాన్ని ఉల్లంఘించుట
8 హెబ్రీ బానిసలకు స్వేచ్ఛ నివ్వాలని రాజైన సిద్కియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడంబడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది.
9 ప్రతి పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల చేయవలసి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండ హెబ్రీ బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంశీయులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకోరాదు.
10 అందువాల్ల యూదా నాయకులు, ప్రజలు ఈ ఒడంబడికకి అంగీకరించారు. ప్రతి పౌరుడు తన వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదలచేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని చేయించరాదు. అందుకు ప్రతి పౌరుడు ఒప్పుకున్నాడు. దానితో బానిసలంతా స్వేచ్ఛగా వదిలివేయబడ్డారు.
11 కాని ఆ తరువాత
* బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.
12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు చేరింది: 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ ‘యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ పూర్వీకులకు ఈజిప్టు నుండి నేను తీసుకొని వచ్చాను. నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన చేసినాను. 14 మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు. 15 కొద్ది కాలంకిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన్ని పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు. 16 కాని ఇప్పుడు మీరు మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించరని నిరూపించుకున్నారు. ఇది మీరెలా చేశారు? వదిలి పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ తిరిగి తీసుకున్నారు. వారు తిరిగి బానిసలయ్యేలా ఒత్తిడి చేశారు.’
17 “అందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ సాటి హెబ్రీయులకు స్వేచ్ఛ నివ్వలేదు. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా నేను స్వేచ్ఛ నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను స్వేచ్ఛ నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.’ ” ఇదే యెహోవా వాక్కు. “ ‘మిమ్మల్ని గురించి చెప్పగానే ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చరం చెందేలా మీకు మహా విపత్తు కలుగజేస్తాను.
18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే.
† 19 యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోను ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు.
20 కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తారు. వారిని చంప తలపెట్టిన ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. వారి శవాలు పక్షులకు, క్రూర మృగాలకు ఆహారమవుతాయి.
21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి
‡ నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.
22 బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలిపిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు ‘ఆ సైన్యం యెరూషలేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, దానికి నిప్పుపెట్టి తగలబెడతారు. నేను యూదా రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు వట్టి ఎడారులవలె మారి పోతాయి. మనుష్యులెవ్వకూ అక్కడ నివసించరు.’ ”