14
యెహోవా వద్దకు పునరాగమనమగుట
1 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము. 2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము,
“మా పాపాన్ని తీసివేయుము.
మా మంచి పనులను అంగీకరించుము.
మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
3 అష్షూరు మమ్మల్ని కాపాడదు.
మేమిక యుద్ధ గుర్రాల పైన స్వారీ చేయుము.
మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను
ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము.
ఎందుకంటే, అనాధుల పట్ల
జాలి చూపేది నువ్వొక్కడివే.”
యెహోవా ఇశ్రాయేలును క్షమించుట
4 అందుకు యెహోవా ఇలా అంటాడు:
“నా కోపం చల్లారింది, కనుక,
నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను.
నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను.
ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు.
అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
6 అతని శాఖలు విస్తరిస్తాయి,
అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు.
అతను లెబానోనులోని దేవదారు చెట్లు
వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.
గోధుమ కంకుల్లాగ పెరుగుతారు.
ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు.
వారు లెబానోను ద్రాక్షారసం వలె ఉంటారు.”
విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా హెచ్చరిక
8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.
నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే.
నేను నిరంతరం పచ్చగానుండే
మీ ఫలము నానుండి వస్తుంది.”
చివరి సలహా
9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.
చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి.
యెహోవా మార్గాలు సరైనవి.
మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు.
పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.