28
భార్యకోసం యాకోబు అన్వేషణ
1 ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు. 2 కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు. 3 సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన. 4 దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్టే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.”
5 ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. లాబాను రిబ్కానకు తండ్రి బెతూయేలు. యాకోబు, ఏశావులకు తల్లి రిబ్కా.
6 తన తండ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు పంపినట్టు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించినట్టు ఏశావుకు తెలిసింది. 7 యాకోబు తన తల్లిదండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్టు ఏశావుకు తెలిసింది.
8 తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు తెలిసింది. 9 అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, మరో స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె మాహలతును అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మాయేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబాయోతు సోదరి.
దేవుని గృహం – బేతేలు
10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్టు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్టు యాకోబు చూశాడు.
13 అప్పుడు ఆ నిచ్చెన దగ్గర యెహోవా నిలిచినట్టు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు గూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.
15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్ధానం చేసినది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”
16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని “యెహోవా ఈ స్థలములో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్టు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.
17 యాకోబు భయపడ్డాడు. “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.
18 ఉదయం పెందలాడే లేచాడు యాకోబు. అతడు పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు యాకోబు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోసాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేసాడు. 19 ఆ స్థలం పేరు లూజు. అయితే బేతేలు* బేతేలు “దేవుని గృహం.” అని దానికి యాకోబు పేరు పెట్టాడు.
20 అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేసాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుచు ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, 21 నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు. 22 నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.