28
యాజకుల వస్త్రాలు
1 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.
2 “నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి. 3 ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు. 4 ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు. 5 బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టలను ఉపయోగించాలని ఆ మనుష్యులకు చెప్పు.
ఏఫోదు – నడికట్టు పట్టి
6 “ఏఫోదు తయారు చేయటానికి బంగారు దారాలు, సన్నని పేనిన నార బట్ట సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపయోగించాలి. నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు. 7 ఏఫోదు* ఏఫోదు ప్రత్యేక అంగీ భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్ట వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం బట్టలకు కట్టబడతాయి.
8 “ఏఫోదు మీద వేసుకొనే కండువాను వారు చాల జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడుతుంది.
9 “నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రాయేలు పండ్రెండు మంది కుమారుల పేర్లు ఈ రత్నాల మీద చెక్కాలి 10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, మరో రత్నం మీద ఆరు పేర్లు రాయాలి. పెద్ద కుమారుడు మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో పేర్లు చెక్కు. 11 ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు. 12 అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్ట మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడ్డ రెండు రాళ్లు ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది. 13 ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి బంగారం ఉపయోగించు. 14 స్వచ్ఛమైన బంగారు గొలుసులను కలిపి తాడు పేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు అల్లికలకు బిగించు.
న్యాయతీర్పు పైవస్త్రం
15 “ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి. 16 ఈ న్యాయతీర్పు పైవస్త్రం 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది ఒక సంచి అయ్యేటట్టుగా మడత చేయబడాలి. 17 న్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు వరుసలు పెట్టాలి. ఈ రత్నాల మొదటి వరసలో పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి. 18 రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి. 19 మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి. 20 నాలుగో వరుసలో రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం ఉండాలి. న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రత్నాలన్నీ నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి. 21 ఇశ్రాయేలు కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ తీర్పు పైవస్త్రం మీద పన్నెండు రత్నాలు ఉంటాయి. ఈ రాళ్లలో ఒక్కొదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు.
22 “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా ఉంటాయి. 23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు. 24 న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి. 25 ఆ గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర రెండు భుజం బట్టలమీద పెట్టు. 26 ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, న్యాయతీర్పు పైవస్త్రం, అవతల ఉన్న మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న న్యాయతీర్పు పైవస్త్రం లోపలి వైపు ఇది. 27 ఇంకా రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి ఏఫోదు దట్టీ పైభాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి. 28 న్యాయతీర్పు పైవస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు జత చేయాలి. నడికట్లతో వీటిని జత చేసేందుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల న్యాయతీర్పు పైవస్త్రం నడికట్టును పట్టుకొని ఉంటుంది.
29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు. 30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.
యాజకుల యితర వస్త్రాలు
31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి. 34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
36-37 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి. 38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.
39 “అంగీని తయారు చేసేందుకు సున్నితమైన నార బట్టను ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్నితమైన నారబట్టను ఉపయోగించాలి. నడికట్టు మీద బుట్టా కుట్టాలి. 40 చొక్కాలు, పట్టాలు, తలపాగాలు కూడా తయారు చేయాలి. ఇవి వారికి గౌరవమర్యాదలు కలిగిస్తాయి. 41 నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత వారు యాజకులని చూపెట్టేందుకుగాను వారి తలమీద ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తున్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు వారు నన్ను యాజకులుగా సేవిస్తారు.
42 “వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేందుకు శ్రేష్ఠమైన బట్టను ఉపయోగించాలి. లోపల ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి. 43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి.