17
బలులకు మంచి జంతువులనే ఉపయోగించాలి
1 “ఏదైనా దోషం ఉన్న ఆవునుగాని, గొర్రెనుగాని మీరు మీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యం.
విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష
2 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషడు లేక ఒక స్త్రీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు మీరు వినవచ్చును. వారు యెహోవా ఒడంబడికను తప్పిపోయినట్టు 3 వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. 4 ఇలాంటి దుర్వార్త మీరు వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘటన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలసుకోవాలి. అది వాస్తవమని మీకు ఋజువైతే 5 ఆ చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి. 6 ఆయితే ఆ వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి. 7 ఆ వ్యక్తిని చంపటానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్యనుండి ఆ చెడును నిర్మూలించాలి.
కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు
8 “మీ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతరమైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యానేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. లేక యిద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి హాని కలిగిన విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి. 9 లేవీ వంశానికి చెందిన యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు. 10 అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి. 11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.
12 “ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహోవాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షించాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడుగును మీరు అరికట్టాలి. 13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు.
రాజును ఎన్నుకోవడం ఎలా?
14 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశాన్ని స్వాధినం చేసుకొని దానిలో మీరు నివసిస్తారు. అప్పుడు మీరు ‘మా చుట్టూ ఉన్న రాజ్యాలలాగే మాకూ ఒక రాజును మేము నియమించుకొంటాము’ అంటారు. 15 అలా జరిగినప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన రాజునే మీరూ ఏర్పరచుకోవాలి. మీ మీద వుండే రాజు మీ ప్రజల్లో ఒకడై ఉండాలి. ఒక విధేశీయుణ్ణి మీరు రాజుగా చేయకూడదు. 16 రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొనివచ్చేందుకు ఆతడు ఈజిప్టుకు మనుష్యలను పంపకూడదు. ఎందుకంటే ‘మీరు ఎప్పుడూ తిరిగి ఆ మార్గాన వెళ్లకూడదు’అని యెహోవా మీతో చెప్పాడు గనుక. 17 మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది ఆతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.
18 “ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి ఆతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి. 19 రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. ఆతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ ఆతడు నేర్చుకొంటాడు. 20 అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. ఆతడు ధర్మశాస్త్రనికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, ఆతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.