9
దానియేలు ప్రార్థన
1 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్వావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. 2 దర్వావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మియా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.
3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చుని ఉపవాస ముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియ పర్చుకొన్నాను. 4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పు కొన్నాను.
“ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజల పట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.
5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం. 6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితో మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.
7 “ప్రభువా, నీపు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదర గొట్టబడిన ఇశ్రాయేలు వారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసిన వారమైయున్నాము.
8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గుపడ వలసిన వారమైతిమి.
9 “ప్రభవు దయామయుడు, క్షమాపణా స్వభావం గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా పాపం చేశాము. 10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము. 11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే మేము నీ ఎడల పాపం చేశాము
12 దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా ఎడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహావిపత్తును యెరూషలేము ఎడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు. 13 ఆ భయంకర విషయములన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మా మీద జరిగాయి. మేము మా పాపాలు మాని, అయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు. 14 ప్రభువు మా మీద నాశనాన్ని రప్పించటానికి వెను కాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.
15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందు వలననే నీవీ నాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము. 16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో సుంచుకొని, పరిశుద్ధ పట్టణం పట్ల, యెరూషలేం పట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాల వల్ల, మా పూర్వీకుల అపరాధాల వల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
17 “కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన పరిశుద్ధ స్థలం మీద ప్రకాశించుగాక! 18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన మా పైన, నీ పేరు పెట్టబడిన నగరము పైన నీ దృష్టినుంచుము. మేము నీతి మంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము. 19 ప్రభువా! నా మొర ఆలకింపుము. ప్రభువా మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయుము. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”
డెబ్బై వారాలకు సంబంధించిన వివరము
20 నేనింకా మాట్లాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభువైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని. 21 నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు బలియర్పణ సమయాన వచ్చాడు. 22 అతడు వచ్చినాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు వివేకము, గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను. 23 నీవు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థము చేసికొనుము.
24 “నీ ప్రరజలకు నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది.
25 “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించు కొనుము- యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింప బడిన రాజు వచ్చేవరకు ఏడు వారాలు అవుతుంది. అరవైరెండు వారాలలో యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది. 26 అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు* అభిషేకింపబడిన రాజు మెస్సీయా (క్రీస్తు). చంప బడుతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.””
27 “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్దవారం బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించ బడేవరకు ఈ విధముగా జరుగుతుంది”