20
హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుట
1 ఆ సమయమున, హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందునంతగా వ్యాధిగ్రస్తుడైనాడు. ఆమోజు కుమారుడు “యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్లి, ‘నీ ఇంటిని సరిదిద్దుకో. ఎందుకంటే నీవు మరణిస్తావు. నీవు బతకవు’ అని యెహోవా చెప్పుచున్నాడని చెప్పెను.”
2 హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు. 3 “యెహోవా, నిన్ను నేను హృదయస్ఫూర్తిగా సేవించానని జ్ఞాపకము చేసుకో. నీవు మంచివని చెప్పిన పనులు నేను చేశాను” అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు.
4 యెషయా తన మధ్యగది విడిచి వెళ్లడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది. 5 నా మనుష్యులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్లి అతనితో చెప్పు. మీ పూర్వికులైన దావీదు యొక్క యెహోవా దేవుడనైన నేను, “నీ ప్రార్థన ఆలకించాను. నీ కన్నీళ్లు చూశాను. అందువల్ల నీ రోగమును నయము చేస్తాను. మూడవ రోజున, నీవు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లుము. 6 నేను నీ జీవితానికి పదునైదుయేండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడతాను. అష్షూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడతాను. నేనిది నా కోసము చేస్తున్నాను. ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకి వాగ్దానం చేశాను కనుక” అని పలికెను.
7 తర్వాత యెషయా, “అత్తికాయల మిశ్రము చేసి దానిని వాచిన చోట వుంచుము” అన్నాడు.
అందువల్ల వారు అత్తికాయల మిశ్రం తీసి దానిని హిజ్కియాకు వాచిన చోటవుంచారు. తర్వాత హిజ్కియా స్వస్థపడెను.
8 హిజ్కియా యెషయాతో, “యెహోవా నాకు నయం చేసే సంకేతము ఏమిటి? మూడో రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్లడానికి సంకేత మేమిటి?” అని అడిగాడు.
9 “నీ కేది కావాలి? నీడ పది అడుగులు ముందుకి పోవలెనా లేక పది అడుగులు వెనుకకు పోవలెనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పినది చేసేందుకు సంకేతము” అని యెషయా చెప్పాడు.
10 హిజ్కియా, “నీడ పది అడుగులు క్రిందికి వెళ్లడం, నీడకు చాలా సులభమైనది లేదు. నీడని పది అడుగులు వెనుకకు మరల్చుము” అని బదులు చెప్పాడు.
11 తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు. మరియు యెహోవా నీడను పదిమెట్లు వెనుకకు మరలునట్లు చేసెను. అది పూర్వము వున్నట్లుగా, మెట్ల మీద వెనుకకు పోయాడు.
హిజ్కియా మరియు బబులోను నుంచి వచ్చిన మనుష్యులు
12 ఆ సమయమున, బలదాను కొడుకైన బెరోద క్బలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. బెరోదక్బలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా వ్యాధిగ్రస్తుడైవున్నాడని విన్నందువల్లనే. 13 హిజ్కియా బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానించాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదైన పరిమళ తైలము, ఆయుధాలు, మొదలైన వాటిని చూపించాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు.
14 తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగాడు.
“వారు చాలా దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు.
15 “వారు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని యెషయా అడిగినాడు.
“వారు మాట ఇంట అన్నీ చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” అని హిజ్కియా సమాధానమిచ్చాడు.
16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను. 17 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీపూర్వికులు సమకుర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబడుతుంది. ఏమియు మిగలదు. యెహోవా దీనిని చెప్తున్నాడు. 18 బబులోను వారు నీ కుమారులను తీసుకుపోతారు. మరియు నీకుమారులు బబులోను రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.”
19 అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవితకాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా మంచిది.”
20 హిజ్కియా చేసిన అన్ని సత్కార్యములు నగరంలోకి నీళ్లు రావడానికి గాను అతను జలాశయము, సొరంగ కాలువను, నిర్మించిది కాలువలు వేయించినది కూడా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. హిజ్కియా మరణించగా, 21 అతని పూర్వికులతో పాటుగా, అతనిని సమాధి చేశారు. మరియు హిజ్కియా కుమారుడు మనష్షే అతని తర్వాత కొత్తగా రాజ్యయ్యాడు.