29
యూదా రాజుగా హిజ్కియా
హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె. ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.
హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు. 4-5 యాజకులను, లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయానికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: “లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని పవిత్రం చేయజాలవు. మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు. వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు. కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు. అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు. 10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయిన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు. 11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”
12-14 ఆలయాన్ని శుద్ధి చేయటానికి ఉద్యమించిన లేవీయులు ఎవరనగా:
 
కహాతీయుల వంశం నుండి అమాశై కుమారుడైన మహతు, మరియు అజర్యా కుమారుడైన యోవేలు.
మెరారీ వంశం నుండి అబ్దీ కుమారుడైన కీషు, మరియు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా.
గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యెహోహు; యెవాహు కుమారుడైన ఏదేను.
ఎలీషాపాను సంతతిలో షిమ్రీ, యెహియేలు,
ఆసాపు సంతతిలో జెకర్యా, మత్తన్యా.
హేమాను సంతతిలో యెహీయేలు, షిమీ
యెదూతూను సంతతిలో షెమయా, ఉజ్జీయేలు.
 
15 ఈ లేవీయులు తమ సోదరులనందరినీ పిలిపించి ఆలయాన్ని సంప్రోక్షించటానకి* సంప్రోక్షించటానికి పరిశుద్ధ పర్చటానికి. సంసిద్ధులయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజాజ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి చేయటానికి లోనికి వెళ్లారు. 16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు. 17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము. 19 రాజైన అహాబు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.
20 రాజైన హిజ్కియా నగర అధికారులను సమవేశపర్చి, మరునాటి తెల్లవారుఝామునే యెహోవా ఆలయానికి వెళ్లాడు. 21 వారు ఏడు గిత్తలను, ఏడు గొర్రె పొట్టేళ్లను, ఏడు గొర్రె పిల్లలను మరియు ఏడు చిన్న మేకపోతులను తెచ్చారు. ఇవి యూదా రాజ్యం తరుపున పాపపరిహారార్థ బలుల నిమిత్తం, పవిత్ర స్థలాన్ని శుద్ధిపర్చటానికి, మరియు యూదా ప్రజల పాపపరిహారం కొరకు తేబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద ఆ పశువులను బలియిమ్ముని రాజైన హిజ్కియా అహరోను సంతతి వారైన యాజకులను ఆజ్ఞాపించాడు. 22 కావున యాజకులు గిత్త దూడలను చంపి రక్తాన్ని భద్రపర్చారు. పిమ్మట వారు గిత్త దూడల రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. తరువాత యాజకులు పొట్టేళ్లను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. ఆ తరువాత యాజకుల గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠంమీద చల్లారు. 23-24 పిమ్మట యాజకులు మేక పోతులను రాజు ముందుకు, అక్కడ చేరిన ప్రజల ముందుకు తెచ్చారు. ఈ మేకలు పాపపరిహారార్థ బలికొరకు తేబడ్డాయి. యాజకులు తమ చేతులను మేకల మీద వుంచి వాటిని చంపారు. యాజకులు మేకల రక్తాన్ని బలిపీఠం మీద పాపపరిహారం కొరకు చిలికించారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను దేవుడు క్షమించుగాకయని వారాపని చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపున ఈ దహనబలులు, పాపపరిహార బలులు అర్పించాలని రాజు చెప్పాడు.
25 దావీదు, రాజుకు దైవజ్ఞుడైన గాదు, మరియు ప్రవక్తయైన నాతాను వీరంతా నిర్దేశించిన రీతిగా రాజైన హిజ్కియా యెహోవా ఆలయంలో తాళములు సర్వమండలములు, సితారలు వాయించటానికి లేవీయులను నియమించాడు. ఇలాగు జరుగవలెనని యెహోవా ప్రవక్తల మూలకంగా ఆజ్ఞాపించియున్నాడు. 26 కావున దావీదు చేయించిన వాద్య పరికరాలు చేతబచ్చుకొని లేవీయులు, బూరలు పుచ్చుకొని యాజకులు సిద్ధంగా నిలబడ్డారు. 27 ఆ తరువాత హిజ్కియా బలిపీఠం మీద దహనబలి అర్పించమని ఆజ్ఞాపించాడు. దహనబలి మొదలైనప్పుడు దైవప్రార్థన కూడ మొదలయ్యింది. బూరలు ఊదబడ్డాయి. ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలు వాయించబడ్డాయి. 28 దహనబలి కర్యక్రమం పూర్తయ్యే వరకు సమావేశమైన వారంతా తమ శిరస్సులు వంచారు. సంగీత విద్వాంసులు గానం చేశారు; యాజకులు బూరలుఊదారు.
29 బలులన్నీ పూర్తి అయిన పిమ్మట రాజైన హిజ్కియా, అతనితో వున్న ప్రజలంతా శిరస్సులు వంచి ఆరాధించారు. 30 రాజైన హిజ్కియా, అధికారులు యెహోవాకు స్తుతిగీతాలు పాడుమని ఆజ్ఞ యిచ్చారు. దావీదు, దైవజ్ఞుడగు ఆసాపు రచించిన భక్తిగీతాలు వారు ఆలపించారు. వారు దేవుని కీర్తించి, ఆనదించారు. వారంత శిరస్సులు వంచి దేవుని ఆరాధించారు. 31 తరువాత హిజ్కియా యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు మీ ప్రభువైన యెహోవా సేవకు పునరంకితమయ్యారు. దగ్గరకు రండి. బలులు, కృతజ్ఞతార్పణలు ఆలయానికి తిసుకొని రండి.” తరువాత ప్రజలు బలులు, కృతజ్ఞతా నైవేద్యాలు తెచ్చారు. సమర్పించాలనుకున్నవారు దహనబలులు కూడ తెచ్చారు. 32 సమావేశమైన, ప్రజలు మందిరానికి తెచ్చిన అనేక దహన బలులు యిలా వున్నాయి: డెభ్బై గిత్త దూడలు, వంద పొట్టేళ్లు, మరియు రెండు వందల గొర్రె పిల్లలు. ఈ జంతువులన్నీ యెహోవాకు దహనబలులుగా సమర్పించబడ్డాయి. 33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి. 34 దహన బలుల జంతువుల చర్మాలు తీయటానికి, వాటిని నరకటానికి తగినంత మంది యాజకులు లేరు. కావున వారి బంధువులగు లేవీయులు కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధమై వచ్చేవరకు సహాయపడ్డారు. లేవీయులు మాత్రం గంభీరంగా తమ ప్రభువైన యెహోవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వారు యాజకులకంటె ఎక్కువగా పనిమీద మనస్సు లగ్నం చేశారు. 35 అక్కడ దహనబలులు, సమాధానబలుల కొవ్వు, పానార్పణలు విస్తారంగా జరుపబడ్డాయి. ఆ విధంగా ఆలయంలో అర్చన కార్యక్రమం మళ్లీ మొదలయింది. 36 హిజ్కియా, అతని ప్రజలు దేవుడు తన ప్రజలకొరకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతోషం వెలిబచ్చారు. ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేయించినందుకు వారిలో ఆనందం వెల్లివిరిసింది.

*29:15: సంప్రోక్షించటానికి పరిశుద్ధ పర్చటానికి.