20
యెహోషాపాతు యుద్దం ఎదిరించటం
1 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు. 2 కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.” 3 యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు. 4 యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు. 5 యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు. 6 అతడు ఈ విధంగా ప్రార్థించాడు:
“మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు! 7 నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తడి చేశావు. ఈ పనినీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు. 8 అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు. 9 వారు, ‘యుద్ధాలు, శిక్ష వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.
10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు* వెళ్లనీయలేదు పూర్తి వివరాలకు చూడండి ద్వితియోపదేశకాండము. 2:4-7, 19. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు. 11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు. 12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”† చూస్తూన్నాం హెబ్రీ భాషలో “మా కళ్లు నీమీదనే వున్నాయి” అని వుంది.
13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు. 14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో 15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం. 16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.’ ”
18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు. 19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.
20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”
21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు.
“యెహోవాకు భజన చేయండి;
ఆయన ప్రేమ తరగనిది!”
అంటూ వారు సంకీర్తన చేశారు. 22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. 23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు.
24 యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు. 25 శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. 26 నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా‡ బెరాకా హెబ్రీలో దీవెన లేక పొగడ్త అని అర్థం. లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.
27 తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు. 28 వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.
29 ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు. 30 అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
యెహోషాపాతు పాలన పరిసమాప్తి
31 యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి ముప్పై ఐదేండ్లవాడు. అతడు యెరూషలేములో ఇరవైయైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. అజూబా తల్లిపేరు షిల్హీ. 32 తన తండ్రి ఆసా నడిచిన రీతిగా యెహోషాపాతు ఉత్తమ జీవితాన్ని గడిపాడు. యెహోషాపాతు ఆసా మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి పనులన్నీ యెహోషాపాతు చేశాడు. 33 కాని బూటకపు దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి తమ హృదయాలను తిప్పలేదు.
34 యెహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన పనులన్నీ యెహో వ్రాసిన గ్రంథాలలో పొందుపర్చబడ్డాయి. యెహో తండ్రిపేరు హనానీ. ఈ విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
35 చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు చేశాడు. 36 తర్షీషు§ తర్షీషు ఇది ఇశ్రాయేలుకు చాలా దూరంలో వున్న ఒక పట్టణం. బహుశః స్పెయిను దేశంలో కావచ్చు. మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేసే పెద్ద పెద్ద ఓడలకు తర్షీషు పట్టణం ప్రసిద్ధిగాంచింది. పట్టణానికి పయనించే ఓడలను చేయించటానికి యెహోషాపాతు అహజ్యాతో కలిశాడు. వారు ఓడలను ఎసోన్గెబెరులో నిర్మించారు. 37 అప్పుడు ఎలీయెజెరు అనే ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు తండ్రి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: “యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందువల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” అలానే అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను పంపలేకపోయారు.
*20:10: వెళ్లనీయలేదు పూర్తి వివరాలకు చూడండి ద్వితియోపదేశకాండము. 2:4-7, 19.
†20:12: చూస్తూన్నాం హెబ్రీ భాషలో “మా కళ్లు నీమీదనే వున్నాయి” అని వుంది.
‡20:26: బెరాకా హెబ్రీలో దీవెన లేక పొగడ్త అని అర్థం.
§20:36: తర్షీషు ఇది ఇశ్రాయేలుకు చాలా దూరంలో వున్న ఒక పట్టణం. బహుశః స్పెయిను దేశంలో కావచ్చు. మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేసే పెద్ద పెద్ద ఓడలకు తర్షీషు పట్టణం ప్రసిద్ధిగాంచింది.