థెస్సలొనీకయులకు
వ్రాసిన మొదటి లేఖ
1
1 మన తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
దేవునికి కృతజ్ఞతలు
2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. 3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న ధృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము సువార్తను మీకు ఒట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. 8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. 9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకంలో నుండి రానున్న దేవుని కూమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.